క్రికెట్…పోలీస్..అండ్ ఆనంద్

కలలు అందరూ కంటారు.
కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు.
ఎక్కువ మంది తమ బంగారు భవిష్యత్ కోసం కలలు కంటారు.
కానీ చాలా కొద్ది మంది మాత్రం చుట్టూరా ఉన్న సమాజం బాగుండాలని కలలు కంటారు.
ఆ కలలను నిజం చేయడానికి తమవంతు పాత్రను నిజాయితీగా పోషిస్తారు.అటువంటి అరుదైన ధీశాలుల్లో ఐపీఎస్ ఆఫీసర్ సి.వి.ఆనంద్ ఒకరు.

తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు సి.వి.ఆనంద్.
నిబద్ధతగల పోలీసు అధికారిగా సి.వి.ఆనంద్ గురించి అందరికీ తెలుసు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి…మృత్యువుకు అత్యంత దగ్గరగా వెళ్లి బయట పడ్డ యోధుడిగా ఆనంద్ ను ఒక యోధుడిగానే భావిస్తారు పోలీసు విభాగంలో.
పోలీసు శాఖలో మనకి చాలా మంది యోధులైన అధికారులు ఉన్నారు.
పోలీసు విభాగంలో రక రకాల సంస్కరణలు తెచ్చిన అధికారులు ఉన్నారు.
ఎంతటి పెద్ద రాజకీయ నాయకుడు ఆదేశించినా రూల్స్ కి విరుద్ధంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోని అధికారులూ అక్కడక్కడ..అప్పుడప్పుడూ మెరుస్తూనే ఉన్నారు.
వినూత్న ఆలోచనలతో పోలీసు విభాగాన్ని పరుగులు పెట్టించిన వారూ ఉన్నారు.
మరి ఆనంద్ స్పెషాలిటీ ఏమిటి?

పైన మనం చెప్పుకున్న అరడజనుకు పైగా లక్షణాలన్నీ ఒక్క ఆనంద్ లోనే ఉన్నాయి.
విధి నిర్వహణలో రాజీపడ్డం అంటే ఏంటో కూడా తెలీకుండానే ఆయన పని చేస్తూ వస్తున్నారు.
తన పరిధిలో ఎన్నో సంస్కరణలకు రూపకల్పన చేసి ..పై అధికారుల చేత ఒప్పించి ..వారిని మెప్పించి..ఆ సంస్కరణలను పోలీసు విభాగమంతా విస్తరించేలా చేసిన విజనరీ ఆనంద్ .
కనీసం నాలుగు సార్లు నక్సలైట్ల దాడల నుంచి ప్రాణాలతో బయట పడ్డ చిరంజీవి.
అయినా ప్రాణాలకు లెక్కచేయకుండా డ్యూటీ చేయడాన్ని తన కర్తవ్యంగా భావించే అరుదైన అధికారి ఆనంద్.
అన్నింటికీ మించి.
ఆనంద్ ఎన్నడూ బాస్ లా వ్యవహరించలేదని ఆయనతో పని చేసిన పోలీసు సిబ్బందే చెబుతారు.
ఆయన బాస్ కాదు. మంచి లీడర్.
బాస్ అంటే కంటి చూపుతో కింది సిబ్బంది చేత అన్ని పనులు చేయించేవాడు.
అదే లీడర్ అయితే..తాను ముందుండీ పనులు చేస్తూ ..సహచరులచేత చేయిస్తూ వారికి ఆదర్శంగా ఉంటూ..స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకు సాగేవాడు.
ఆనంద్ దృష్టిలో హోం గార్డు నుంచి తన స్థాయి వరకు తనతో పని చేసే ప్రతీ పోలీసూ తన సహచరుడే. తనకంటే చిన్న స్థాయి ఉద్యోగులను చిన్న చూపు చూడ్డం..పై అధికారులను మెప్పించడానికి ప్రయత్నించడం రెండూ చేయలేదు ఆనంద్.
ఆయన పోలీసు విభాగంలో సాధించిన అద్భుత విజయాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆయన ప్రస్థానం ఎలా సాగిందో ఓ సారి తెలుసుకోవడం అవసరం.

హైదరాబాద్ లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆనంద్ బాల్యం చాలా మంది పిల్లల్లాగే సాగింది.
ఆటలంటే ప్రాణం.
విపరీతంగా ఆడేవారు.
అలాగని చదువుకు దూరం కాదు.
చదువంటే మితిమీరిన ఇష్టం.
ఆటకీ..చదువుకీ మధ్య అనితర సాధ్యమైన సమన్వయాన్ని ముక్కుపచ్చలారని ప్రాయంలోనే అలవాటుగా మార్చుకున్నారు ఆనంద్.
సైఫాబాద్ లోని విద్యారణ్య హై స్కూల్ లో చదివారు ఆనంద్.
ఇంటర్మీడియట్ చదివే సమయంలో క్రికెట్ పై మనసు పారేసుకున్నారు.
అంతకు ముందు నుంచే క్రికెట్ లో ఆల్ రౌండర్ గా ఎదిగిన ఆనంద్ ఇంటర్ నుంచి రక రకాల టోర్నీల్లో మెరుస్తూ వచ్చారు. కీలక ఇన్నింగ్స్ తో తన జట్టును గెలిపిస్తూ వచ్చారు.
నిజాం కాలేజీలో కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు.
నిజాం కాలేజీలో చదివేటప్పుడే .ఇంటర్ యూనివర్శిటీ టోర్నీల్లో అదరగొట్టారు.
ఆ తరుణంలో భారత్ అండర్ -19 జట్టు ఇంగ్లాండ్ పర్యటించింది.
ఆ జట్టులో ఆనంద్ కూడా సభ్యుడు.
ఆ సమయంలోనే.. ఫుల్ టైమ్ క్రికెటర్ గా సెటిల్ అవ్వాలని ఆనంద్ ఆకాంక్షించేవారు.
చేతిలో ఆట ఉంది. ప్రతిభకు కొదవ లేదు. కానీ ..క్రికెటర్ గానే ఎదగాలంటే..తట్టుకుని నిలబడ్డానికి అవసరమైన ఆర్ధిక స్థోమత మాత్రం ఆనంద్ తల్లిదండ్రులకు లేదు.
క్రికెటర్ గా సెటిల్ అవ్వాలంటే జాతీయ జట్టులో అవకాశం వచ్చేవరకు పడిగాపులు పడాలి.
ఎంతటి ప్రతిభ ఉన్నా జట్టులో స్థానం దక్కాలంటే మాటలు కాదు. ఏళ్ల తరబడి నిరీక్షించాలి. అంతవరకూ ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉండాలి. ఇదంతా బాగా డబ్బున్న వాళ్ల కే సాధ్యమవుతుంది.ఇది డబ్బున్న వాళ్ల ఆట. తన లాంటి మధ్య తరగతి మనుషులకు క్రికెట్ కోసమే నిరీక్షించడం కష్టమని అనుకోగానే… మనసులో కొంత నిరాశ చెందారు ఆనంద్. కానీ చాలా వేగంగా ఆ నిరాశ నుంచి బయట పడ్డారు. కర్తవ్యం ఏంటా అని ఆలోచించారు.
అలా ఆలోచిస్తోన్న తరుణంలోనే ఆయన జీవితాన్ని ఓ మలుపు తిప్పింది ఓ ఐడియా.
నిజంగానే ఆయన జీవితాన్ని మార్చేసిన ఐడయా అది.
కాకపోతే ఆ ఐడియా ఆయన మెదడులో పుట్టింది కాదు.
ఆయన మనసులో స్థానం సొంతం చేసుకున్న ఓ మహిళామూర్తి మెదడులోంచి ఆ ఐడియా బయటకు వచ్చింది. సివిల్ సర్వీసెస్ ను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కవ మంది ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని ఆయన స్నేహితురాలు చెప్పడంతో… ఆయనకూ అదే కరెక్ట్ అనిపించడంతో మరో ఆలోచన లేకుండా సివిల్స్ కు ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
ప్రాక్టీస్ ఉన్నా లేకున్నా సెంచరీలు చేసే క్రికెటర్ ఆయన. ఇక ప్రాక్టీస్ కూడా తోడైతే చెప్పేదేముంది. సివిల్స్ లో మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యారు. అది కూడా 77 వ ర్యాంకుతో సగర్వంగా. 1992 లో ఐపీఎస్ పోస్టింగ్. అపుడు ఆయన వయసు కేవలం 22 ఏళ్లు. అంటే తన ఈడు కుర్రాళ్లు ఇంకా జీవితాన్ని ఎంజాయ్ చేసే మూడ్ లో ఉండే వయసది.పోలీసు శాఖలో అడుగు పెట్టాక చుట్టూరా ఉన్న సమాజం ఇంకా బాగా అర్ధమవ్వడం మొదలైంది.
అందరూ ప్రశాంతంగా జీవించాలంటే…కొందరు అహోరాత్రులూ శ్రమించాలని అర్ధమైంది.ఆ కొందరిలో తానూ ఉన్నానని తెలుసు. ఆ సవాల్ ను చాలా ఇష్టంగా స్వీకరించారు. చాలా మంది కోసం తన లాంటి కొందరు పోలీసులు తమ సుఖాలను త్యాగం చేయడం ఉదాత్తమైన డ్యూటీ అని అనిపించింది.ఎక్కువ మంది కళ్లల్లో ఆనందాన్ని చూడ్డం కోసం..తమ కళ్లల్లో ఆనందాన్ని త్యాగం చేయడం కూడా సంతోషమే అనుకున్నారు.
తన లాగే చాలా మంది పోలీసులు అదే పని చేస్తున్నారని తెలుసు. అందుకే పోలీసునని చెప్పుకోడానికి చాలా గర్వపడతారాయన.

మనతో పని చేసేవాళ్లు మనల్ని గౌరవించాలంటే ఏం చేయాలి…?
వారితో కలిసిపోయి..మనం పని చేస్తూ వాళ్ల చేత చేయిస్తూ..అంతా ఓ టీమ్ వర్క్ లా.. ఓ మంచి ఆటలా చేయాలి. అలా ఆడుతూ పాడుతూ ఏ పని చేసినా అలసట తెలీదు. ఆనందం తప్ప ఏమీ మిగలదు.
నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాహసోపేతంగా విధులు నిర్వహించారు.ఆ సమయంలోనే కనీసం నాలుగు సార్లు నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంచి తృటిలో తప్పించుకున్నారు.

పోలీస్ స్టేషన్ కు ఏదో ఒక సమస్యతో వచ్చే పౌరులను సాదరంగా ఆహ్వానించి వారి కష్టాలను పోగొడితే..ఆ పౌరులు ఎంత ఆనందిస్తారో ఆయన చూశారు. అలా ఎక్కువ మంది ఆనందిస్తోంటే..ఆనంద్ కి సంతృప్తిగా ఉండేది.
రాజకీయ పలుకుబడితోనో….సంపన్న వర్గాలమన్న ధీమాతోనో తన దగ్గరకు వచ్చి పనులు పురమాయించే వాళ్లని అల్లంత దూరంలోనే పెట్టేయడం ఆనంద్ కు అలవాటు.
ఫిర్యాదుచేయడానికి వచ్చిన వ్యక్తి దగ్గర న్యాయం ఉందని పిస్తే..ప్రపంచం తల్లకిందులైనా సరే వారిని కాపాడ్డానికి వెనుకాడరు ఆనంద్.అదే వచ్చిన వారే దోషులని తెలిస్తే..ఎంతటి పెద్ద నాయకుడు రికమెండ్ చేసినా ఆనంద్ ఆ పని చేసేవారు కాదు.రాజీ పడకుండా అలా విధులు నిర్వహించడానికే ప్రభుత్వం తనకు జీతం ఇస్తోందని నమ్ముతారాయన.జీతం తప్ప ఇంకే రకమైన డబ్బులతోనూ తనకు అవసరం కానీ..పని కానీ లేదని భావిస్తారు ఆయన.

పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు ఆనంద్.
రక రకాల విభాగాల్లో పని చేశారు. ఎక్కడ చేసినా తనదంటూ ఓ ముద్ర వేసి మరీ వస్తారు.
అదే సి.వి. మార్కు.
ట్రాఫిక్ విభాగంలో ఉన్నప్పుడే ఎండనక..వాననక..మంచనక..చలి అనక…రాత్రీ పగలూ తేడా లేకుండా నడి రోడ్డుపై నిలబడి విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం రక రకాల సదుపాయాలు కల్పించిన మొదటి అధికారి బహుశా ఆనందే.
ఇక ఆనంద్ అనగానే హైదరాబాద్ జంటనగరాలకు గుర్తుకొచ్చేది డ్రంకెన్ డ్రైవ్.
తప్ప తాగి..ఆ మత్తులో డ్రైవింగ్ చేసి..తమ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవారికి చెక్ చెప్పడానికి ఆనంద్ డ్రంకెన్ డ్రైవ్ మొదలు పెట్టారు.
ఎంతటి పదవిలో ఉన్న వారైనా సరే..
ఎంతటి ప్రముఖులైనా సరే..
తాగి డ్రైవింగ్ చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పేశారు ఆనంద్.
చెప్పి ఊరుకోలేదు. దాన్ని కచ్చితంగా అమలు చేశారు.
తాగి డ్రైవ్ చేసినా..పోలీసులు పట్టుకుంటే యాభయ్యో..వందో ఇచ్చి తప్పించుకోవచ్చులేననే పొగరుబోతులకు షాక్ ట్రీట్ మెంటే ఇచ్చారు ఆనంద్.
సెలబ్రిటీలు..సినీ స్టార్లు..రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు…కార్పొరేట్ దిగ్గజాలు..
ఎవరినీ వదల్లేదు. తాగి డ్రైవ్ చేస్తే కేసు నమోదు చేసేయడమే.
అక్కడి నుంచి కోర్టుకు తరలించడమే. ఈ డ్రైవ్ సక్సెస్ కావడంతో పాటే..రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.ఇదంతా ఆనంద్ ఆలోచన ఫలితమే నని పోలీసు సిబ్బందే గర్వంగా చెబుతారు.
ప్రమోషన్లకోసం..కావల్సిన చోట్లకు బదలీల కోసం..ఆనంద్ ఎన్నడూ వెంపర్లాడలేదు.
ఏ పోస్ట్ ఇస్తే అది చేశారు. ఎక్కడికి బదలీ చేస్తే అక్కడికి పోయి ఆనందంగా ఉద్యోగం చేశారు. అలా ఉద్యోగం చేస్తూనే తనదంటూ ఓ ముద్రను బలంగా వేశారు. 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ లో ఉన్న ఆనంద్..తెలంగాణ రాష్ట్ర అవతరణతో తెలంగాణ క్యాడర్ కు అలాట్ అయ్యారు.
ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
చైన్ స్నాచర్ల ఆట కట్టించే పనిలో ఆనంద్ బిజీగా ఉన్నారు.

 
క్రికెట్టే అన్నీ నేర్పింది
 
ఆనంద్ తాను కలగన్నట్లు క్రికెటర్ గా సెటిల్ అయి ఉండి ఉంటే…భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో రికార్డులు సృష్టించి ఉండేవారు. ఎన్నో మ్యాచుల్లో భారత్ ను గెలిపించి ఉండేవారు. అంతర్జాతీయ స్థాయిలో ఎందరో అభిమానులను సంపాదించుకుని ఉండేవారు.కానీ ఆ కల నెరవేరలేదు.అది ఆయన దురదృష్టం కావచ్చు.
కానీ అది హైదరాబాద్ వాసుల అదృష్టం కూడా.
ఆయన క్రికెటర్ కాకపోవడం వల్లనే ఓ మంచి పోలీసు అధికారి మనకి దక్కారు.
నిజాయితీగా ..నిర్భయంగా …నిర్మొహమాటంగా ..నిక్కచ్చిగా.. వ్యవహరించే ఐపీఎస్ అధికారి మనకి లభించారు.నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించారు.
క్రికెటర్ గా స్థిరపడకపోయినా..క్రికెట్ ఆట తనకు ఎంతో నేర్పిందని ఆనంద్ అంటూ ఉంటారు.
ఒక టీమ్ లా ఎలా ముందుకు సాగాలో క్రికెట్ నేర్పింది.
బ్యాట్స్ మన్ గా చెడ్డ బంతులను బౌండరీలను తరలించడమెలాగో ఆనంద్ కు తెలుసు.
ఆ చిట్కాతోనే చెడ్డ మనుషులను జైళ్ల లోపలికి పంపడం ఎలాగో కూడా ఆయనకు తెలుసు.
మంచి బాల్ పడే వరకు సహనంగా ఆడాలని క్రికెట్ నేర్పింది.
అలాగే నేరస్థుల వేటలో సాక్ష్యాలు దొరికే వరకు సహనంగా అన్వేషణ చేయడమెలాగో అబ్బింది.
ఇలా క్రికెట్ లో అడుగడుగునా ఆయన నేర్చుకున్న పాఠాలనే పోలీసు జీవితానికి అన్వయించుకుని విజయాలు సాధిస్తున్నారాయన.

ఇన్ని విజయాల తర్వాత బహుశా ఆనంద్ కి కూడా తాను క్రికెటర్ కాకపోవడమే మంచిది అయిందని అనిపించవచ్చు.ఎందుకంటే ఆయన తన ఆనందం గురించి కన్నా సమాజ శ్రేయస్సు గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే క్రికెటర్ ఆనంద్ కన్నా ఐపీఎస్ ఆనందే రియల్ హీరో.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*