నాపేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి..

’నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఒక పవర్ ఫుల్ సైనికుడి పంచ్ డైలాగ్! ’నా పేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి’ అనేది ఒక సిన్సియర్ మోస్ట్ పోలీసధికారిణికి సూటయ్యే చక్కటి మాట! ఆశయం, ఆత్మబలం, అంకితభావం.. ఈ మూడూ కలగలిస్తే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందనడానికి ఆమె ఒక నిలువెత్తు సాక్ష్యం! కర్తవ్య దీక్షకు ఖాకీ చొక్కా తొడిగితే ఎలా ఉంటుందో అలా వుంటుందీమె మేనరిజం!

శ్రీమతి బూరుగు రాజకుమారి ఐపీఎస్.. 2007 బ్యాచ్.. ఇప్పుడు రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా వున్నారు. పక్కనుండే ఏలూరే ఆమె పుట్టినూరు. ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. సివిల్ సర్వీసెస్ మీద మక్కువ కారణంగా పోలీస్ ప్రొఫెషన్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. గతంలో మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్ గా, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా, రంగారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. నూజివీడు, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో కీలక సర్వీసులు నిర్వర్తించారు. 2016 మేనెల 16న రాజమహేంద్రవరం అర్బన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఛార్జ్ తీసుకుని.. అక్కడి ప్రజానీకానికి బాగా దగ్గ్గరయ్యారు.

పోలీసంటే.. పి ?పాజిటివ్’!
ప్రజల శాంతిభద్రల్ని పర్యవేక్షించడం అనేది అత్యంత సంతృప్తికరమైన ఉద్యోగం.. మన సమాజంలో ఇంతకంటే ఉన్నతమైన వృత్తి ఏదీ లేదని నేను భావిస్తాను’’ ఈ మాట ఎస్పీ రాజకుమారి నోటి నుంచి కాదు మనసు నుంచి వచ్చింది. తన వృత్తి మీద తనకు ఎంతటి ఆత్మ సంతృప్తి వుందన్నది ఈ ఒక్క మాట దగ్గరే అర్థమవుతుంది. ప్రజల ధన, మాన, ప్రాణాల్ని కాపాడే బృహత్తర బాధ్యతను మోస్తున్నందుకు ప్రజాస్వామ్యానికి మనమెంతో రుణపడివున్నామంటూ ఆమె ఎన్నోసార్లు చెబుతారు. రాజమండ్రి పట్టణ ఎస్పీగా ఆమె చేపట్టే ప్రతీ చర్యలోనూ ఆ ’కమిట్మెంట్’ స్పష్టంగా కనిపిస్తుంది.

శిలలపై శిల్పాలు చెక్కినారు!
పీసీలుగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు.. అవును ఇది కనిపిస్తున్న వాస్తవం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన ఉన్నత విద్యావంతులు సైతం కానిస్టేబుళ్లుగా చేరుతున్నారు. వీళ్లందరి నైపుణ్యతను నేరాల నిర్మూలనకు ఉపయోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి చెబుతున్నారు. రాజమండ్రిలో జరిగిన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ శిక్షణా తరగతుల సమయంలో ఆమె కొత్తగా ఉద్యోగంలో చేరిన విమెన్ కానిస్టేబుళ్లను కదిలించి వాళ్ళ మనోభావాల్ని అడిగి తెలుసుకున్నారు. 13 జిల్లాల నుంచి ఎంపికైన 181 మందికి 9 నెలల పాటు జరిగిన ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ’ఒక శిలగా శిక్షణకొచ్చారు. శిక్షణ తర్వాత ఒక శిల్పంగా రూపాంతరం చెంది బయటకు వెళ్ళాలి అంటూ ఆకాంక్షించారు. ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని భుజం తట్టేవారు.

షీ టీమ్స్ వెనుక ’ఆమె’ కృషి
షి టీమ్స్‌ని మహిళలకు రక్షణ కవచాల్లా పనిచేయించడంలో రాజమండ్రి పట్టణ పోలీసు విభాగం ప్రత్యేక చొరవ చూపించింది. వాట్సాప్, ఈమెయిల్, ప్రత్యేక యాప్‌ల సాయంతో చురుగ్గా పనిచేస్తున్న షి టీమ్స్ పై స్థానికంగానే కాక.. బైటి నుంచి ప్రశంసలు పడుతున్నాయి. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో అర్బన్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో షి టీమ్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు చీఫ్ గెస్ట్‌గా హాజరై.. రాజమండ్రి షీ టీమ్స్‌ని అభినందించారు. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు స్థిరనివాసం ఉంటారని, అందుకే మహిళల ఆత్మాభిమానాన్ని రక్షించడానికి షీ టీమ్స్ ని బలోపేతం చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి అన్నారు. సమాచారం అందించిన 10నిమిషాల్లోపే ఘటనా స్థలానికి చేరుకొని ఎందరో విద్యార్థినులను ఆడుకున్నామన్నారు. మహిళా రక్షణ కోసం ’యూ సేఫ్’ అనే ప్రత్యేక యాప్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒలింపియన్ పీవీ సింధుతో పాటు, ఎస్పీ రాజకుమారి కూడా అపూర్వ సత్కారం అందుకున్నారు.

పచ్చని తోటలో చల్లని చెయ్యి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి.. మనిషికో మొక్క నాటి మన ఆక్సిజన్‌ను మనమే సంపాదించుకోవాలి.. ఇదీ ఎస్పీ రాజకుమారి ఇస్తున్న ఎకో ఫ్రెండ్లి పిలుపు. లాలాచెరువులో నూతన ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ’వనం-మనం’ కార్యక్రమాన్ని ఆమె దగ్గరుండి నిర్వహించారు. వందలకొద్దీ అందమైన మొక్కలతో గ్రీనరీమయంగా మారింది అర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. పచ్చదనంతో మనసుకు తెలియని చికిత్స జరిగి స్వాంతన చేకూరుతుందన్నది ఎస్పీ రాజకుమారి అభిమతం. ఆమె అభిరుచిని, సామాజిక దృక్పథాన్ని రాజమండ్రి ప్రజలు ప్రశంసించారు.

బెండు తియ్యడమే ఎజెండా
64 కళల్లో చోర కళ ఒకటి. ఇప్పుడీ చోరకళ మరింత కళాత్మకంగా మారిపోయింది. అప్డేట్ అవుతున్న నేరస్తుల్ని అంతకంటే అప్డేటెడ్ గా వెంటాడకపోతే మేం పోలీసులం ఎలా అవుతాం అంటారు రాజమండ్రి అర్బన్ పోలీసులు. ఇందుకోసం లాఠీలకు మరింత పదును పెట్టుకుని, కాసింత కాఠిన్యం చూపించడం మొదలుపెట్టేశారు. పైగా ఇక్కడ.. డైరెక్షన్ మేడమ్ రాజకుమారిది. ఆమె డ్యూటీలో దిగిన తర్వాతే రాజమండ్రిలో పేకాట శిబిరాలు పూర్తిగా మూతబడ్డాయి. లక్ష్మివారపుపేట లాంటి చోట్ల ఆకస్మిక దాడులు జరిపి పేకాటరాయుళ్ల తోళ్ళు వలిచిందామె! మహిళల జీవితాల్ని చెరబట్టే బెల్టు షాపుల మీద సైతం యుద్ధం ప్రకటించింది. మూలగొయ్యి-సీతంపేట ప్రాంతంలో బెల్టు షాపుల్ని సీజ్ చేసి.. మిగతా షాపులవాళ్లకు హెచ్చరిక జారీ చేశారు పోలీసులు.

మత్తు ఇంజక్షన్ల ముఠా ఆటకట్టు
మత్తు మందులు అమ్ముతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రాజమండ్రి ప్రజలకు రిలీఫ్ నిచ్చారు రాజమండ్రి పోలీసులు. రాజమండ్రి మెయిన్ రోడ్డులో విజయ టాకీస్ వెనుక వీధి.. సాయి కృష్ణ థియేటర్ రోడ్డు వద్ద అర్ధరాత్రి అనుమానంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, భారీ స్థాయిలో మత్తు ఇంజక్షన్లు, మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఈ మత్తు ఇంజక్షన్లను ఒక్కొక్కటీ ఐదు రూపాయలకు కొని వాటిని మార్కెట్లో రెండు వందలకు విక్రయిస్తున్నట్టు ఎస్పీ బి.రాజకుమారి చెప్పారు. వీరిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ ఆక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. నాలుగేళ్ల నుంచి నగర ప్రజలను ఆందోళన పరుస్తున్న ఈ మత్తు ఇంజక్షన్ల టెన్షన్ వీడినట్లయింది. అటు.. ఒడిశా నుంచి విశాఖ మీదుగా రాజమండ్రికి డ్రగ్స్ సరఫరా అవుతున్న ఉదంతంపై ఎస్పీ ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ అమ్మకాలపై సమాచారం ఇవ్వాలంటూ తన కార్యాలయం ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఆయిల్ ట్యాంకర్లలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 21,50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
డిసెంబర్ 31న ’జీరో యాక్సిడెంట్’ లక్ష్యంగా పెట్టుకుని సాధించి చూపెట్టారు. కోడి పందేల నియంత్రణ అనే సవాల్ ని కూడా చేతికి తీసుకుని.. ఆ దిశగా ఉక్కుపాదం మోపారు రాజమండ్రి అర్బన్ పోలీసులు. సంక్రాంతి సీజన్లో నకిలీ నోట్ల చెలామణీ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో నిఘా పెంచేశారు. పాతిక లక్షల మేర నోట్లు ముద్రించి కోడి పందేల్లో వెదజల్లడానికి ప్రయత్నాలు జరగడంతో.. పోలీసుల దాడిలో ఈ గుట్టు రట్టయ్యింది. కలర్ జెరాక్స్‌తో తయారయ్యే ఈ నకిలీ కరెన్సీ బెడద రాజమండ్రికి తప్పినట్లే!
ఆటో డ్రైవర్ల ముసుగులో ప్రయాణీకులను దోచుకునే నేరస్తులకు సైతం చెక్ పడింది. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ల ఏర్పాటుతో ప్రజల మన్ననలు పొందారు ఎస్పీ రాజకుమారి. ఇప్పుడు గుండెల మీద చెయ్యేసుకుని పోలీసుల నిఘాలోనే ప్రయాణం చేస్తున్నారు రాజమండ్రి జనం.

హెల్మెట్ లేకపోతే నో ఎంట్రీ!
శిరస్త్రాణం ధరించండి ప్రాణాపాయం నుంచి బయటపడండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా..అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో తామే రంగంలోకి దిగారు రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులు. ముందుగా తాము ఆచరించి చూపించి మిగతావారికి చెబితే బాగుంటందని భావించిన వారు ఇందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించుకున్నారు. ద్విచక్రవాహన చోదకులు శిరస్త్రాణం ధరిస్తేనే అర్బన్ పోలీసు కార్యాలయంలోనికి ప్రవేశం ఉంటుంది. లేదంటే బయటే వాహనాన్ని ఉంచి నడుచుకుంటూ లోపలికి వెళ్లాలి. ఈ నిబంధనను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. వెరైటీ అవెర్నెస్ అంటే ఇదే మరి!
మహిళా పోలీసులతో ఏకంగా హెల్మెట్ ర్యాలీ నిర్వహించి జనంలో చైతన్యం కోసం మరో వినూత్న ప్రయత్నం జరిగింది. హెల్మెట్లు ధరించి మాత్రమే టూవీలర్లు డ్రైవ్ చేయాలన్న నినాదంతో రాజమండ్రి నడివీధుల్లో జరిగిన పోలీస్ బైక్ ర్యాలీ ఒక సూపర్ సక్సెస్! ఇందులో ఎస్పీ రాజకుమార్ సహా ఉన్నత పోలీసాధికారులు అందరూ పాల్గొన్నారు. జనం పట్ల ఇంతకంటే కమిట్మెంట్ ఇంకేముంటుంది అంటూ రాజమండ్రి ప్రజలు చెప్పుకున్నారు.

గుర్తుండిపోయ్యే పుష్కర అనుభవం
ప్రజల భాగ్నస్వామ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని గోదావరి అంత్యపుష్కరాల ద్వారా నేర్చుకున్నానంటారు ఎస్పీ రాజకుమారి. రాజమండ్రిలో కమ్యూనిటీ పోలీసు ఆఫిసర్ వ్యవస్థను ప్రారంభించే సమయంలో ఆమె ఈ విధంగా స్పందించారు. పెరుగుతున్న అవసరాలను బట్టి పోలీసులకు ప్రజల సహకారం తప్పనిసరి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఔత్సాహిక యువత తోడ్పాటుతో పోలీసుల పని సులభతరం చేసుకోవడమనే ఈ తరహా ప్రయోగం ఏలూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో సక్సెస్ అయినట్లే.. రాజమండ్రిలో కూడా సూపర్ సక్సెస్ చేశారు. మొత్తం 2 వేల మంది సీపీఓల్లో అందులో 800 మంది నైట్ డ్యూటీలకు, 400 మందిని ట్రాఫిక్ కి తరలించడం, బీట్ విధానాన్ని పటిష్ఠపర్చడం లాంటివన్నీ ఆమె కార్యాచరణలు. వినాయక ఉత్సవాలు సామరస్యంగా జరుపుకునేలా ఉత్సవ కమిటీలు, మత పెద్దలతో సంప్రదింపులు జరిపి.. ఆ మేరకు విజయవంతమయ్యారు ఎస్పీ రాజకుమారి.

ముఖ్యమంత్రి అభినందన
రాజమండ్రి అర్బన్ జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా అభినందించారు సీఎం చంద్రబాబు. నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ని పరిశీలించి, అక్కడున్న లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టమ్ డెమోను చూసి.. భళా అన్నారు. నేరాల నియంత్రణకు మీరు పాటించే ఆధునిక విధానం సూపర్ అంటూ ప్రశంసించారు. మినిట్స్ బుక్‌లో తన అభిప్రాయం రాస్తూ.. ఎస్పీ పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సమాజమే దేవాలయం
ప్రజలకు ఆరోగ్యంపై అవగాహనా కల్పించేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా కృషి చేయడంలో రాజమండ్రి అర్బన్ పోలీసులు ముందడుగేశారు. జైన్ సేవా సమితి, ధన్వంతరి రక్త నిధి సహకారంతో ఎస్పీఎఫ్ నేతృత్వంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం జరిగింది. అర్బన్ ఎస్పీ రాజకుమారి సహా అనేకమంది పోలీసధికారులు ఇందులో పాల్గొన్నారు. రక్తదానం చేస్తే దైవ సాక్షాత్కారం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ చెప్పారు. గౌతమీ నేత్రాలయం ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, అవసరమైనవాళ్లకు కళ్లజోళ్లు ఇప్పించారు.

మనోధైర్యమే సగం బలం
మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగినప్పుడే సగం సమస్యలు తీరిపోతాయని ఎస్పీ రాజకుమారి చెబుతారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన 2కె రన్ కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. మహిళలు కూడా సమాజాభివృద్ధిలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తి జీవితాల్లో మహిళలు అనేక పాత్రలు పోషిస్తున్నారని, ఈ క్రమంలో శారీరక, మానసిక ఫిట్నెస్ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. షీ టీమ్స్ నిర్వహించిన ఈ సామాజిక పరుగులో వందలమందితో కలిసి తానూ కదం తొక్కారు.

మై డియర్ స్టూడెంట్స్..
మన ఆలోచనా విధానమే మన భవిష్యత్తుకు పునాదులేస్తుంది. విద్యార్ధి దశలో ఏ విధంగా ఆలోచిస్తామో అదే ధోరణి వాళ్ళ వాళ్ళ విధుల్ని, ఉద్యోగాల్ని శాసిస్తుంది.. అంటారు ఎస్పీ రాజకుమారి. కందుకూరి వీరేశలింగం కళాశాలలో జరిగిన అవెర్ నెస్ ప్రోగ్రాంలో ఎస్పీ చెప్పిన ’సూక్తులు’ అక్కడి విద్యార్థులు మెదళ్లలో నాటుకుపోయాయి. ఎంత నిగ్రహంతో ఉంటే అంతటి ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందన్న ఎస్పీ రాజకుమారి వాచకం.. విద్యార్థిలోకం మొత్తానికి ఆదర్శప్రాయం కూడా. ఒక పోలీసధికారిగా ఉంటూ ఇంత గొప్ప సామాజిక స్పృహ కలిగివుండడం అభినందనీయమంటూ అక్కడి వక్తలు ఎస్పీ మీద ప్రశంసలు కురిపించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నియంత్రణ, రహదారి భద్రతలపై రాజమండ్రిలో తరచూ అవగాహనా సదస్సులు నిర్వహించడం, ఇటువంటి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలివ్వడం ఎస్పీ రాజకుమారి డ్యూటీలో ఒక భాగంగా భావిస్తారు.
పోలీసులంటే భయపడే రోజులు పోయి.. పోలీసుల్లో ఆత్మబంధువుల్ని చూసుకునే రోజులు వచ్చాయంటే.. దానికి ఇటువంటి కొందరు ’గట్టి’ పోలీసులే కారణం. రాజమండ్రి ఉన్నంత వరకూ రాజకుమారి గుర్తుంటుంది అంటూ ఆ ఊరు ఊరంతా ఒకేమాట చెప్పుకుంటోందంటే.. దానికి రాజకుమారి వ్యక్తిత్వం, రాజకుమారి మనసు, రాజకుమారి మాట, రాజకుమారి ఆశయం.. అన్నీ కారణాలే! అందుకే మేడమ్ రాజకుమారికి వెయ్యి సెల్యూట్లు కొట్టినా తక్కువే!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*